Telangana: తెలంగాణలో మహాకూటమికి రూ.1,000 కోట్ల నిధులు.. మొత్తం ఫైనాన్స్ చేస్తోంది చంద్రబాబే!: విజయసాయిరెడ్డి
- అందుకే గెహ్లాట్ రహస్యంగా భేటీ అయ్యారు
- వీటిని పాలు, కూరగాయలు అమ్మి సంపాదించారా?
- సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి(మహా కూటమి) అభ్యర్థులందరికీ చంద్రబాబు ఫైనాన్షియర్ గా మారారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో భేటీ కావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-టీడీపీల మధ్య రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డీల్ కుదిరిందని ఆరోపించారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్ బుక్ లో విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. ‘తెలంగాణ ఎన్నికలకు మహా కూటమి అభ్యర్ధులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్. కాంగ్రెస్ నేత గెహ్లాట్ రాహుల్ దూతగా అమరావతి వచ్చి బాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం ఇదే. మొత్తం మీద రూ.1000 కోట్లు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభమే కదా!’ అని పోస్ట్ చేశారు. కాగా, విజయ సాయిరెడ్డి విమర్శలపై టీడీపీ నేతలు ఇంకా స్పందించలేదు.