Ponnala Lakshmaiah: జనగామలో పోటీ చేయడం, గెలవడం ఖాయం: పొన్నాల లక్ష్మయ్య
- 35 ఏళ్లుగా నాకు, జనగామకు సంబంధం ఉంది
- పొత్తులో భాగంగా నా సీటే కావాలని అడగడం భావ్యం కాదు
- చర్చల నేపథ్యంలోనే నా పేరు ప్రకటనలో జాప్యం జరుగుతోంది
జనగామ నుంచి తాను పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తాను గెలవడమే కాకుండా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందనే వార్తలను అధికారిక పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్, జనగామ, పొన్నాల లక్ష్మయ్యకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ఇలాంటి అనుబంధాన్ని దెబ్బతీయాలనేది రాజకీయాల్లో సాధారణ అంశమేనని అన్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుంటే... పొత్తులో భాగంగా తన సీటే కావాలని అడగడం సరైంది కాదని చెప్పారు.
జనగామలో తానే ఓడిపోయే పరిస్థితి ఉంటే... కొత్తగా పార్టీ పెట్టిన నేత అక్కడ గెలుస్తారా? అని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే, తన పేరును ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. జనగామ స్థానాన్నే సదరు నేత ఎందుకు అడుగుతున్నారనే విషయాన్ని ఆయన కానీ, కాంగ్రెస్ నేతలు కానీ చెప్పాలని అన్నారు. పొత్తులు బాగుండాలనే తాను కోరుకుంటున్నానని తెలిపారు.