dasoju sravan: దాసోజు శ్రవణ్ నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు నిరాకరించిన రిటర్నింగ్ అధికారి
- నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు వెళ్లిన శ్రవణ్ సహచరులు
- శ్రవణ్ తో పాటు, ప్రతిపాదించిన వ్యక్తులు లేకపోవడంతో.. నామినేషన్ ను స్వీకరించని అధికారి
- రిటర్నింగ్ అధికారి ఛాంబర్ నుంచి 100 మీటర్ల వరకు సెక్షన్ 144 అమలు
ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కు రిటర్నింగ్ అధికారి ముషారఫ్ ఫారూఖీ షాక్ ఇచ్చారు. ఆయన నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు నిరాకరించారు. వివరాల్లోకి వెళ్తే, శ్రవణ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఆయన సహచరులు ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారు. అయితే, వ్యక్తిగతంగా శ్రవణ్ లేకపోవడం, ప్రపోజల్ గా ఉన్నవారు కూడా ప్రత్యక్షంగా లేకపోవడంతో నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, నామినేషన్ ను స్వీకరించాలంటే అభ్యర్థి కానీ, ఆయన ప్రతిపాదించిన వ్యక్తులు కానీ ఉండాలని చెప్పారు. శ్రవణ్ విషయంలో ఇద్దరూ లేకపోవడంతో... నామినేషన్ పత్రాలను స్వీకరించలేదని తెలిపారు. రిటర్నింగ్ అధికారి ఛాంబర్ నుంచి 100 మీటర్ల వరకు సెక్షన్ 144 అమల్లో ఉంటుందని... ఎవరూ ఎన్నికల నినాదాలు చేయరాదని చెప్పారు. అభ్యర్థితో పాటు కేవలం నలుగురిని మాత్రమే కార్యాలయం గేటు లోపలకు అనుమతిస్తామని తెలిపారు. ఏ పార్టీ కూడా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించరాదని చెప్పారు.