rajnath singh: షాహిద్ అఫ్రిదీ చెప్పింది ముమ్మాటికీ నిజమే: రాజ్ నాథ్ సింగ్
- పాకిస్థాన్ పాలకులు వారి దేశాన్నే సరిగా పాలించలేకపోతున్నారు
- వాళ్లు కశ్మీర్ ను ఎలా మేనేజ్ చేస్తారు?
- భారత్ లో కశ్మీర్ ఎప్పటికీ అంతర్భాగమే
పాకిస్థాన్ లో ఉన్న నాలుగు ప్రావిన్సులనే సరిగా పాలించుకోలేక పోతున్నాం... మనకు కశ్మీర్ ఎందుకంటూ ఆ దేశ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, అఫ్రిదీ వ్యాఖ్యలు ముమ్మాటికీ సరైనవేనని చెప్పారు. 'అతను నిజమే చెప్పారు. పాకిస్థాన్ పాలకులు వాళ్ల దేశాన్నే సరిగా పాలించలేకపోతున్నారు. ఇక వాళ్లు కశ్మీర్ ను ఎలా మేనేజ్ చేస్తారు? కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే' అని రాజ్ నాథ్ అన్నారు.
బ్రిటీష్ పార్లమెంటు వద్ద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పాకిస్థాన్ కు కశ్మీర్ అవసరం లేదని... ఉన్న నాలుగు ప్రావిన్సులనే సరిగా మేనేజ్ చేసుకోలేకపోతున్నామని అఫ్రిదీ అన్నాడు. దీనిపై పాక్ లో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా తన వ్యాఖ్యలపై అఫ్రిదీ వివరణ ఇచ్చాడు. తన మాటలను భారత మీడియా వక్రీకరించిందని ఆయన తెలిపాడు. తన దేశం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పాడు. కశ్మీరీల పోరాటం చాలా గొప్పదని కితాబిచ్చాడు. కశ్మీర్ లో మానవత్వం పరిఢవిల్లాలని, కశ్మీరీలు వారి హక్కులను సాధించుకోవాలని ఆకాంక్షించాడు.