khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గం వదిలి వెళ్లే ప్రసక్తే లేదు: కాంగ్రెస్ నాయకుడు రోహిన్ రెడ్డి
- తనకు టికెట్ ఇవ్వకపోవడంపై రోహిన్ నిరసన
- ఈ నియోజకవర్గంతో దాసోజ్ కు సంబంధమే లేదు
- ఈ నెల 17న నామినేషన్ వేస్తున్నా
ఖైరతాబాద్ నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నాయకుడు రోహిన్ రెడ్డి టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నివాసం వద్ద ధర్నాకు దిగారు. ఖైరతాబాద్ స్థానాన్ని దాసోజ్ శ్రవణ్ కుమార్ కు పార్టీ అధిష్ఠానం కేటాయించడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నుంచి తప్ప మరెక్కడి నుంచి తాను పోటీ చేయనని తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నియోజకవర్గం నుంచి తాను కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయికి ఎదిగానని ప్రతిఒక్కరితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
ఖైరతాబాద్ కాంగ్రెస పార్టీ కంచుకోట అని, అలాంటి నియోజకవర్గం నుంచి దాసోజ్ శ్రవణ్ కు టికెట్ ఇచ్చారని అన్నారు. ఈ నియోజకవర్గంతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చి ఆయన్ని బలిపశువుని చేస్తున్నారన్న అభిప్రాయం కార్యకర్తల్లో, నాయకుల్లో ఉందని చెప్పారు. క్షేత్రస్థాయిలో దాసోజ్ పర్యటించి, అందరితో మమేకమయ్యేందుకు సమయం సరిపోదని, ఎన్నికల గడువు కూడా దగ్గరపడుతుందని అన్నారు. వేరే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసే ప్రసక్తే లేదని, 2009లో కూడా తనకు ఇలాంటి అవకాశం వచ్చినా తాను తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దాసోజ్ శ్రవణ్ కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం తన ఇల్లు లాంటిదని, ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్లే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నానని, ఈ నెల 17న నామినేషన్ వేస్తున్నట్టు రోహిన్ రెడ్డి చెప్పారు.