kyama mallesh: ఆ ఆడియో టేపును ముగ్గురికి వినిపించినా పట్టించుకోలేదు: క్యామ మల్లేశ్
- ఆ టేపును మొదట కుంతియాకు వినిపించా
- ఆ తర్వాత ఉత్తమ్, భట్టి విక్రమార్క విన్నారు
- ఈ ముగ్గురు హైకమాండ్ కు చెప్పలేదు
ఇబ్రహీంపట్నం టికెట్ తనకు కేటాయించాలంటే మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ నేత భక్తచరణ్ దాస్ కొడుకు సాగర్ డిమాండ్ చేశారని టీ-కాంగ్రెస్ నేత, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను కూడా ఆయన బయటపెట్టారు. ఇదే అంశంపై మల్లేశ్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘టీవీ 9’లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మల్లేశ్ మాట్లాడుతూ, ఈ ఆడియో టేపును మొట్టమొదట తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాకు వినిపించానని, ఆ తర్వాత టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, భట్టి విక్రమార్కకు వినిపించానని అన్నారు. ఈ ముగ్గురికి వినిపించినా కూడా వారు మందలించలేదు, హైకమాండ్ కు చెప్పలేదని విమర్శించారు.
అందరి సమక్షంలో తన టికెట్ విషయమై చెబితే, భక్త చరణ్ దాస్ తనను బెదిరించారని ఆరోపించారు. కొంత మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపించిన మల్లేశం.. పొన్నాల లక్ష్మయ్యకు, భిక్షపతి యాదవ్ కు, తనకు పార్టీ టికెట్లు లభించలేదని, బీసీలకు అన్యాయం చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమి నిదర్శనం కావాలని అన్నారు.