Andhra Pradesh: నకిలీ విత్తనాల వెనుక ప్రభుత్వ పెద్దలు.. తీవ్రస్థాయిలో మండిపడ్డ జగన్!
- గత మూడేళ్లుగా చెరకు ఫ్యాక్టరీ చెల్లింపులు చేయలేదు
- రూ.13 కోట్ల బకాయిలు ఇంకా రావాల్సి ఉంది
- ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగానే నకిలీ విత్తనాల సరఫరా
విజయనగరం జిల్లాలో రైతులు కల్తీ విత్తనాలతో నష్టపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోలేదని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సీతానగరం మండలానికి చెందిన రైతులను జగన్ కలిశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా స్థానిక చెరకు ఫ్యాక్టరీ పంటకు చెల్లింపులు సరిగా చేయడం లేదని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గతేడాదే రూ.13 కోట్ల మేర తమకు బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు.
కాగా, ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసినవారిని కఠినంగా శిక్షించాలని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం కారణంగానే నకిలీ విత్తనాలు సరఫరా అయినట్లు నిర్థారణ అయిందనీ, ఇప్పుడు ఎవరిని శిక్షిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఏపీ ప్రతిపక్ష నేత ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.