Telangana: అరుదైన రికార్డు సాధించిన హైదరాబాద్ మెట్రో.. ధన్యవాదాలు తెలిపిన ఎండీ!
- హైదరాబాద్ మెట్రోకు అపూర్వ ఆదరణ
- 99.7 శాతం కచ్ఛితత్వంతో సేవలు
- రోజుకు 13 వేల కి.మీ ప్రయాణం
దాదాపు ఏడాది క్రితం ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోకు నగర ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకూ హైదరాబాద్ మెట్రోలో 3 కోట్ల మంది ప్రయాణించారు. మొత్తం 351 రోజుల్లోనే హైదరాబాద్ మెట్రో ఈ ఘనత సాధించింది. రెండు కోట్ల నుంచి 3 కోట్ల మంది ప్రయాణికులను కేవలం 71 రోజుల్లోనే సంస్థ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోను ఆదరించినందుకు రాష్ట్ర ప్రజలకు సంస్థ ఎండీ కేవీబీ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో 99.7 శాతం కచ్ఛితత్వంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిందని ఆయన తెలిపారు. మెట్రో రైళ్లు రోజుకు 13,000 కిలోమీటర్ల చొప్పున 550 ట్రిప్పులు తిరుగుతున్నాయని వెల్లడించారు. మియాపూర్ నుంచి నాగోలు వరకు 30 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గాన్ని గత ఏడాది నవంబరు 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరు 24న అమీర్‌పేట నుంచి ఎల్‌బీ నగర్ వరకు మరో 16 కిలోమీటర్ల మార్గాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు.