chitnthamaneni prabhakar: మాజీ సర్పంచ్ పై దాడి.. తీరు మార్చుకోని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
- మట్టి తవ్వి తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశాడని ఒకరిపై దాడి
- ఇంటికి తీసుకువెళ్లి విచక్షణా రహితంగా కొట్టిన ఎమ్మెల్యే అనుచరులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
తన దురుసు ప్రవర్తనతో నిత్యం వార్తలలో ఉండే పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్లీ రెచ్చిపోయారు. చింతమనేని, ఆయన అనుచరులు తనను కొట్టి గాయపరిచారని పెదవేగి మాజీ సర్పంచ్ మేడికొండ సాంబశివ కృష్ణారావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏఎస్పీ ఈశ్వరరావు అందించిన వివరాలు ఇవీ..
ఏలూరు నుంచి కృష్ణారావు గురువారం గార్లమడుగు వస్తుండగా వంగూరు-లక్ష్మీపురం మధ్య కొందరు పోలవరం కుడికాలువ గట్టు మట్టిని యంత్రాలతో తవ్వి టిప్పర్లలో పోస్తుండడం చూశారు. వెంటనే పోలవరం కుడి కాలువ అధికారులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ అటుగా వెళ్తూ కృష్ణారావును చూశారు. ఈలోగా ఏఈ ఫోన్ చేసి తాను ఘటనా స్థలికి వస్తున్నానని చెప్పడంతో అతని కోసం కృష్ణారావు అక్కడ వేచి ఉన్నారు. ఇంతలోనే చింతమనేని అనుచరులు గద్దె కిశోర్, మరికొందరు వచ్చి కృష్ణారావుపై దాడి చేసి తీసుకు వెళ్లారు.
పోలవరం కాల్వగట్టు మట్టిని టిప్పర్ల ద్వారా తరలించడం చూసి తాను అధికారులకు ఫిర్యాదు చేశానని, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు తనను ఆయన ఇంటికి లాక్కెళ్లి విచక్షణా రహితంగా కొట్టారని బాధితుడు కృష్ణారావు ఆరోపించారు.