cbi: సీబీఐ కేసుపై ‘సుప్రీం’లో విచారణ.. అలోక్ వర్మకు సీల్డ్ కవర్ లో సీవీసీ నివేదిక కాపీ
- అలోక్ వర్మ సోమవారంలోగా స్పందించాలి
- దీనిపై స్పందనను సీల్డ్ కవర్ ద్వారా వర్మ అందజేయాలి
- ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సీవీసీ అందజేసింది. ఆ నివేదిక కాపీని సీల్డ్ కవర్ లో అలోక్ వర్మకు సుప్రీంకోర్టు ఈరోజు అందజేసింది. దీనిపై సోమవారంలోగా స్పందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అలోక్ వర్మ తనన స్పందనను కూడా సీల్డ్ కవర్ ద్వారా తమకు అందజేయాలని తెలిపింది.
ఈ నివేదిక ద్వారా పలు అభిప్రాయాలు వెలిబుచ్చిందని, వాటిలో కొన్ని అంశాలపై ఇంకా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. అలోక్ వర్మ తన సమాధానం ఇచ్చిన అనంతరం తదుపరి విచారణ మంగళవారం జరుపుతామని, ఈ నివేదికను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలకు కూడా అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉండగా, సీవీసీ నివేదికను తనకు కూడా ఇవ్వాలన్న రాకేశ్ ఆస్థానా అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.