Telangana: తెలంగాణ ఎన్నికల్లో ‘కాంగ్రెస్’ ఓడిపోతే ఉత్తమ్ దే బాధ్యత అంటున్న రెబెల్స్
- ఎన్నో ఏళ్లు కష్టపడితే తీరని అన్యాయం చేశారు
- ఉత్తమ్ తనకిష్టమైన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు
- యునైటెడ్ రెబెల్స్ ఫ్రంట్ గా బరిలోకి దిగుతాం: బోడ జనార్దన్
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే బాధ్యత వహించాలని ఆ పార్టీ రెబెల్స్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కని అభ్యర్థులు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. తమకు టికెట్లు దక్కకపోవడంపై వారు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా బోడ జనార్దన్ మాట్లాడుతూ, తామంతా కలిసి యునైటెడ్ రెబెల్స్ ఫ్రంట్ గా బరిలోకి దిగుతామని ప్రకటించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతుంటే తీరని అన్యాయం చేశారని వాపోయారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు ఇష్టమైన వారితో జాబితా తయారు చేసుకుని, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా సహకారంతో ఆ జాబితాను ప్రకటించుకున్నారని రెబెల్ బోడ జనార్దన్ ఆరోపించారు. తమకు న్యాయం చేయమని అధిష్ఠానాన్ని కోరుతున్నామని, లేనిపక్షంలో తామందరం ఒక ఫ్రంట్ గా ఏర్పడి నలభై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబెల్స్ గా పోటీ చేస్తామని హెచ్చరించారు. మూడు సార్లు ఓడిపోయిన వాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారని విమర్శించారు.