Kodandaram: జనగామపై వీడిన ఉత్కంఠ.. పొన్నాలకు టికెట్ ఖరారు!
- పొన్నాలకు టికెట్ కేటాయించినట్టు కుంతియా ప్రకటన
- బరి నుంచి తప్పుకున్న కోదండరాం
- కామన్ మినిమం ప్రోగ్రాం కన్వీనర్‌గా టీజేఎస్ చీఫ్
సస్పెన్స్‌కు తెరపడింది. పలు మలుపుల తర్వాత జనగామ టికెట్ పొన్నాలకు ఖరారైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ టికెట్‌ను ఖరారు చేసినట్టు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ప్రకటించారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం జనగామ బరి నుంచి తప్పుకోవడంతో లక్ష్మయ్య పోటీకి మార్గం సుగమం అయింది.
కోదండరాం ఎన్నికల బరిలో లేరని కుంతియా తెలిపారు. ఆయన కామన్ మినిమం ప్రోగ్రాం కన్వీనర్‌గా ఉంటారని, రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. పొత్తులు పరిపూర్ణమయ్యాయని, టీడీపీ 14 స్థానాల్లో, జనసమితి 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు కుంతియా వివరించారు.
పొన్నాలకు టికెట్ విషయంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. టీజేఎస్ కార్యాలయానికి వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోదండరాం సహా ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అరగంటపాటు చర్చల అనంతరం కోదండరాంతో మరోమారు ఏకాంతంగా చర్చలు జరిపారు. అర్ధరాత్రి కుంతియాతో జరిగిన చర్చల్లో పొన్నాలకు టికెట్‌పై స్పష్టత వచ్చింది.