gajji mallikarjun: మల్లికార్జున్ కి పాదరక్షలు అందించి.. దీక్ష విరమింపజేసిన కేసీఆర్!
- తెలంగాణ వచ్చేంత వరకు చెప్పులు ధరించనంటూ దీక్ష
- 2005 నుంచి పాదరక్షలు లేకుండానే ఉన్న మల్లికార్జున్
- విషయం తెలుసుకుని చలించిపోయిన కేసీఆర్
గజ్జి మల్లికార్జున్.. గోవిందరావు పేట మండలం పస్రా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2005 జూన్ 6న కాళ్లకు చెప్పులు విడిచేసి... దీక్షను చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు చెప్పులు ధరించనని ఆ సందర్భంగా ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో దీక్ష విరమించి, చెప్పులు ధరించాలనేది ఆయన కోరిక. తన కోరిక తీర్చుకోవడానికి ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించినా వీలుకాలేదు.
ఈ నేపథ్యంలో, మల్లికార్జున్ దీక్ష గురించి ఈనెల 14న కేసీఆర్ దృష్టికి ఎంపీ సీతారాంనాయక్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆశ్చర్యానికి గురయ్యారు. అతని పట్టుదలకు కదలిపోయారు. గురువారం (15వ తేదీ) ఆయనకు సీఎం కార్యాలయ అధికారుల నుంచి పిలుపు వచ్చింది. దీంతో, సీతారాంనాయక్ తో కలసి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ను అభినందించిన కేసీఆర్... ఆయనకు పాదరక్షలు ఇచ్చి, దీక్షను విరమింపజేశారు. దీంతో, ఎట్టకేలకు ఆయన దీక్ష ముగిసింది.