Andhra Pradesh: తెనాలి వ్యాపారికి విజయవాడ పోలీసుల వేధింపులు.. కొరడా ఝుళిపించిన కమిషనర్ తిరుమలరావు!
- పత్రాలు లేకుండా దొరికిన బంగారు వ్యాపారి
- లంచం కోసం గవర్నర్ పేట పోలీసుల వేధింపులు
- కమిషనర్ ను ఆశ్రయించిన బాధితుడు
లంచాల రుచి మరిగిన ఇద్దరు పోలీస్ అధికారులు ఓ వ్యాపారిని వేధించడం మొదలుపెట్టారు. డబ్బులు ఇస్తేనే కేసు నుంచి తప్పిస్తామనీ, లేదంటే జైలుకు పంపుతామని బెదిరించారు. చివరికి ఈ వేధింపులు తట్టుకోలేని బాధితుడు ఏకంగా కమిషనర్ ను ఆశ్రయించాడు. దీంతో ఇద్దరు అవినీతి చేపలపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెనాలికి చెందిన నగల వ్యాపారి బిల్లులు లేకుండా సరుకు తీసుకువెళుతూ విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు దొరికాడు. ఈ ఘటనపై స్టేషన్ సీఐ పవన్ కుమార్ కేసు నమోదుచేశారు. తమకు రూ.5.50 లక్షల మేర లంచం ఇస్తే కేసును కొట్టివేస్తామని సీఐతో పాటు కానిస్టేబుల్ విష్ణు వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు ఫోన్ చేసి వేధించిన సందర్భంగా రికార్డు చేసిన కాల్స్ ను సదరు వ్యాపారి కమిషనర్ ద్వారక తిరుమలరావుకు అందించారు. తాను సరైన పత్రాలు చూపించినా కేసు పేరుతో వేధిస్తున్నారని వాపోయారు.
దీంతో నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇందులో ఇద్దరు అధికారులు వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో సీఐ పవన్ కుమార్ ను వీఆర్ కు పంపారు. అలాగే కానిస్టేబుల్ విష్ణుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలను వేధిస్తే ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.