Telugudesam: బలం లేని చోట బరిలో దిగాలన్న ఆరాటం ఎందుకు?... టీజేఎస్‌కు టీడీపీ నేత సూటిప్రశ్న
- టీఆర్ఎస్ గెలవాలని పరోక్షంగా కోరుకుంటున్నారన్నట్టుంది మీ తీరు
- పోటీ చేస్తున్న స్థానాల్లో ఒక్కటైనా గెలవగలమని నమ్మకం ఉందా
- కోదండరాం షరతులు విధించడం మానేయాలని విజ్ఞప్తి
బలంలేని చోట బరిలో దిగాలని ఆరాటపడుతున్న తెలంగాణ జనసమితి (టీజేఎస్) తీరు చూస్తుంటే అధికార టీఆర్ఎస్ మళ్లీ గెలవడానికి ఆయన పరోక్షంగా సహకరిస్తున్నట్లుందని టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం అన్నారు. టీజేఎస్ అధినేత కోదండరాం ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఏర్పాటు చేసిన టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో టీజేఎస్ ఉనికి కనీసం లేదన్నారు. అటువంటి స్థానాలను టీజేఎస్ కోరడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని టీడీపికి కేటాయించిన విషయం తెలిసిందే. తాను పోటీ చేస్తున్న స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలోనైనా గెలవగలమని కోదండరాం ధీమాగా చెప్పగలరా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
టీజేఎస్‌కు కేటాయించిన స్థానాలన్నింటా కచ్చితంగా గెలుస్తామని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలను నివృత్తి చేసేందుకు టీజేఎస్ స్వచ్ఛందంగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని కోరారు. ఎటువంటి షరతులు విధించకుండా మహా కూటమి అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.