Andhra Pradesh: ఆంధ్రాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోం.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే సీబీఐపై ఆంక్షలు ఉన్నాయి!: మంత్రి కేఈ
- తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిదే విజయం
- సీబీఐ కక్ష సాధింపు ఆయుధంగా మారింది
- జీవోపై బీజేపీ, వైసీపీల రాద్ధాంతం సిగ్గుచేటు
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి(ప్రజాకూటమి) ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను జీవో ద్వారా రద్దు చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం సీబీఐపై ఆంక్షలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కేఈ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోదని కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. తెలంగాణలో ఆ పార్టీతో మహాకూటమి ఏర్పాటు చేయడం వ్యూహాత్మక అవసరమని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఆంక్షలు ఉన్నప్పుడు ఏపీలో విధిస్తే తప్పేంటని కేఈ ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు అస్త్రంగా మారిన సీబీఐకి అనుమతులు రద్దు చేయడం సరైన చర్యేనని అభిప్రాయపడ్డారు. దీనిపై బీజేపీ, వైసీపీలు రాద్ధాంతం చేయడం దారుణమని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.