nayini narsimha reddy: దళితులకన్నా దారుణ స్థితిలో ముస్లింలు బతుకుతున్నారు: నాయిని
- ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూసింది
- టీఆర్ఎస్ పాలనలో ముస్లింలు గౌరవంగా బతుకుతున్నారు
- ముస్లింల కోసం 200కు పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశాం
దళితుల కన్నా ముస్లింలు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ముస్లింలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ముస్లింలు గౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. ముస్లింలలో అక్షరాస్యతను పెంచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందని... మైనార్టీల కోసం 200కు పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. పేద ముస్లింల పెళ్లిళ్ల కోసం షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని రోస్ గార్డెన్ లో మైనార్టీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయినిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.