TRS: అనూహ్యం... నాంపల్లి అభ్యర్థిని మార్చేసిన కేసీఆర్!
- తొలి 105 పేర్లలో ఎం ఆనందకుమార్
- నాంపల్లి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం
- తెరపైకి వచ్చిన సీహెచ్ ఆనందకుమార్
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశామని చెప్పిన నాడే, ఎన్నికల్లో పోటీ పడే 105 మంది పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆపై ఒక దఫాలో ఇద్దరిని, మరో దఫాగా 10 మందిని ప్రకటించగా, ఇంకా కోదాడ, ముషీరాబాద్ స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. కేసీఆర్ నోటి నుంచి ఓ మారు పేరు వస్తే, అదింక మారదని అభ్యర్థులు భావిస్తున్న వేళ, అనూహ్యంగా ఆయన నాంపల్లి అభ్యర్థిని మార్చారు.
తొలి జాబితాలో నాంపల్లి నుంచి ఎం.ఆనంద కుమార్ పేరును కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రచారంలో బిజీగా ఉన్నారు కూడా. గతంలో జాంబాగ్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి, ఎంఐఎం అభ్యర్థిపై స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయనైతే, గట్టిపోటీ ఉంటుందని కేసీఆర్ భావించారు.
అయితే, ఇటీవల 105 మంది అభ్యర్థులకు బీ-ఫామ్ లు ఇచ్చేవేళ, ఆయన నాంపల్లిని మాత్రం పక్కనబెట్టారు. ఇప్పుడాయన స్థానంలో సీహెచ్ ఆనందకుమార్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిపామని చెబుతూ, ఆయనకు బీ-ఫామ్ ఇచ్చినట్టు టీఆర్ఎస్ భవన్ ప్రకటించింది. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎం ఆనందకుమార్ వద్దని ఎంఐఎం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.