Pakistan: పాకిస్థాన్ ఐఎస్ఐ హనీట్రాప్‌లో1100 మంది భారతీయులు!
- భారత జవాన్లపై ఐఎస్ఐ హనీట్రాప్
- నిఘా పెట్టిన ఏటీఎస్
- సమాచారం పాక్‌కు చేరి ఉండొచ్చని అనుమానం
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ విసిరిన హనీట్రాప్ వలలో 1100 మంది భారతీయులు చిక్కుకున్నట్టు ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) గుర్తించింది. మొత్తం 13 ఫేస్బుక్ ఖాతాల ద్వారా ఐఎస్ఐ ఈ వలపుల వల విసిరినట్టు తెలుస్తోంది. ఆయా ఖాతాల్లో ఉన్న 1100 మంది యూజర్లపైనా ఏటీఎస్ నిఘా పెట్టింది.
ఈ 1100 మందినీ రక్షణ శాఖ-సాయుధ బలగాల ఉద్యోగులు, కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు, సాధారణ యూజర్లుగా విభజించినట్టు ఏటీఎస్ ఐజీ అసీం అరుణ్ తెలిపారు. వీరిలో తొలుత రక్షణ శాఖకు చెందిన వారిని ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను వారు ఐఎస్ఐతో పంచుకున్నదీ లేనిదీ దర్యాప్తులో తెలుస్తుందన్నారు.
హనీట్రాప్‌లో చిక్కుకున్న వారి ద్వారా కొంత కీలక సమాచారం ఐఎస్ఐకి చేరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ఐ హనీ ట్రాప్‌లో చిక్కుకున్న బీఎస్ఎఫ్ జవాను అ్యచుతానంద్ మిశ్రా, బ్రహ్మోస్ ఇంజినీరు నిశాంత్ అగర్వాల్ అరెస్ట్ తర్వాతే ఈ 13 ఫేస్బుక్ ఖాతాలను గుర్తించినట్టు అసీం అరుణ్ తెలిపారు.