Haryana: రేప్లేమైనా కొత్తా? అప్పుడూ జరిగాయి.. ఇప్పుడూ జరుగుతున్నాయి: హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
- రేప్‌లు అప్పుడూ ఉన్నాయి.. ఇప్పుడూ ఉన్నాయి
- ఆందోళన మాత్రమే ఎక్కువైంది
- నిందితులు, బాధితులు ఇద్దరూ ఒకరికొకరు తెలిసినవారే
అత్యాచారాలు కొత్త కాదంటూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పంచకుల జిల్లాలోని కల్కా పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖట్టర్ మాట్లాడుతూ.. అత్యాచారాలు కొత్త కాదని, గతంలోనూ ఉన్నాయని, ఇప్పుడే ఎక్కువయ్యాయన్న వార్తల్లో నిజం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం అవి ఎక్కువయ్యాయన్న ఆందోళన మాత్రమే ఎక్కువైందన్నారు.
80-90 శాతం రేప్ కేసులు కేవలం ఈవ్ టీజింగ్ మాత్రమేనన్నారు. బాధితులు, నిందితులు ఇద్దరూ పరస్పరం ఒకిరికి ఒకరు తెలిసినవారే ఉంటారన్నారు. చాలా కాలంగా వారి మధ్య కొనసాగుతున్న బంధం బీటలు వారినప్పుడు.. ‘అతడు నన్ను రేప్ చేశాడంటూ’ ఆమె కేసు పెడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మహిళలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిదర్శనమని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మండిపడ్డారు. అత్యాచారాలు, గ్యాంగ్ రేప్‌లను అడ్డుకోవడం చేతకాని ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు.