visakhapatnam: విశాఖ బీచ్ రోడ్డులో వేలాది మందితో నేవీ మారథాన్...ఉత్సాహంగా పాల్గొన్న 14 వేల మంది
- స్నేహపూర్వక పరుగు పేరుతో 10కే రన్
- తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రారంభం
- పాల్గొన్న సింగపూర్ నావికాదళం
నేవీ డేలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం ఉదయం మారథాన్ నిర్వహించారు. స్నేహపూర్వక పరుగు (ఫ్రెండ్లీ రన్) పేరుతో నిర్వహించిన 10 కిలోమీటర్ల పరుగు పందెంలో సింగపూర్ నావికా దళంతో పాటు, దాదాపు 14 వేల మంది పాల్గొన్నారని అంచనా. తెల్లవారు జామున నాలుగు గంటలకే జరిగిన పరుగుకు నేవీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు వేలాది మంది హాజరు కావడంతో బీచ్ రోడ్డు కిటకిటలాడింది.
ఏటా డిసెంబరు 4న విశాఖ సాగరతీరంలో అంగరంగ వైభవంగా నేవీ డే నిర్వహిస్తారు. ఉత్సవాలకు కొద్ది రోజుల ముందు నుంచే రోజూ ఏదో ఒక కార్యక్రమం చేపడుతుంటారు. నేవీ డే రోజు నావికాదళం సిబ్బంది నిర్వహించే విన్యాసాలను తిలకించేందుకు నగరవాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది హాజరవుతారు. కాగా, ఆదివారం మారథాన్ దృష్ట్యా ఉదయం పోలీసులు బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.