Mahabubabad District: ఉద్యమ ఖిల్లా మానుకోట నాలుగేళ్లలో ఒక్కసారీ గుర్తుకు రాలేదా కేసీఆర్ గారూ? : కాంగ్రెస్ నేత రాజవర్థన్‌రెడ్డి
- ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రాంతానికి ఇన్నాళ్లు ఏం చేశారు
- ఒక్కహామీ నెరవేర్చని మీకు ఎన్నికల వేళ ఇక్కడి వారు గుర్తుకు వచ్చారా
- ఈనెల 23న ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ధ్వజం
తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన మానుకోట అభివృద్ధిని ముఖ్యమంత్రి అయ్యాక ఏనాడూ పట్టించుకోని కేసీఆర్‌కు ఎన్నికల వేళ ఇక్కడి ప్రజలు మళ్లీ గుర్తుకు వచ్చారా? అని పీసీసీ మాజీ కార్యదర్శి వి.రాజవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. మానుకోట ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఈ నాలుగేళ్లలో నెరవేర్చని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఈనెల 23న ఇక్కడకు వస్తున్నారని ప్రశ్నించారు.
మహబూబాబాద్‌లోని రాజీవ్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మానుకోట ప్రజల్ని ఓటడిగే హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి, కుటుంబ పాలనకు తెరతీసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మహా కూటమి లక్ష్యమని చెప్పారు. కూటమి అభ్యర్థి బలరాం నాయక్‌ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య మాట్లాడుతూ ప్రజా కూటమి ద్వారానే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నియంతృత్వాన్ని ప్రజలంతా ఏకమై ఎదిరించాలని టీజేఎస్ జిల్లా నాయకుడు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు.