Telangana: చంద్రబాబు మాటలు నమ్మటానికి ఖమ్మం ప్రజలు ఏమైనా గొర్రెలా?: సీఎం కేసీఆర్
- ప్రాజెక్టు వద్దని బాబు 30 లేఖలు రాశారు
- దాన్ని ఉపసంహరించుకుని ప్రచారానికి రావాలి
- ప్రజాఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
సీతారామా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి 30 సార్లు లేఖ రాశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే తెలంగాణ మరోసారి ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ నేతలను గెలిపించడానికి ఖమ్మం ప్రజలు గొర్రెలు కాదని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్, టీడీపీలు ఉన్న మహాకూటమికి ఓటేస్తే ఖమ్మం జిల్లాకు ఉరితాడు బిగించుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఖమ్మంకు సాగు, తాగునీరు తెచ్చే తమ ప్రయత్నం ఆగిపోతుందని హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఓటేయాలని కోరారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక సీటు గెలిచినా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈసారి 10కి పది సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు నీతినిజాయితీ ఉంటే సీతారామా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాసిన లేఖను ఉపసంహరించుకుని తెలంగాణలో ప్రచారం కోసం అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. సొంత ఆర్థిక వనరుల విషయంలో తెలంగాణ నంబర్ 1గా ఉందని తెలిపారు. తమ నిబద్ధత, క్రమశిక్షణతోనే సాధ్యమయిందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ 17.4 శాతం ఆర్థిక అభివృద్ధి సాధించిందని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో ఏడాదికి రూ.10 వేలు పంట సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.