sabarimala: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరిన ట్రావెన్ కోర్ బోర్డు
- వరదల కారణంగా పంబ, నీలక్కల్ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి
- సరైన సదుపాయాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు
- మహిళలకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయాలి
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో, ఆలయ పరిసర ప్రాంతాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తీర్పును అమలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోరుతూ సుప్రీంకోర్టును ట్రావెన్ కోర్ బోర్డు ఆశ్రయించింది.
ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా పంబ, నీలక్కల్ ప్రాంతాలు ధ్వంసమయ్యాయని... సరైన సదుపాయాల్లేక భక్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సుప్రీంకు బోర్డు తెలిపింది. మహిళా భక్తులకు వాష్ రూములు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని... దీనికి కొంత సమయం పడుతుందని చెప్పింది. మరోవైపు మహిళా భక్తులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో వారికి తగిన భద్రతను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విన్నవించింది.