Mallu Bhatti Vikramarka: మధిర ప్రజలు నీ సంగతేంటో తేలుస్తారు: కేటీఆర్ కు మల్లు వార్నింగ్
- మధిరలో గెలవడం కాదు.. మధిర గేటును కూడా ముట్టుకోలేవు
- ఒక్క రోడ్డు వేయడానికి టీఆర్ఎస్ కు నాలుగేళ్లు పట్టింది
- ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చావు?
మధిరకు తాను ఏమీ చేయలేదంటూ మంత్రి కేటీఆర్ ఒక పిల్ల కాకిలా మాట్లాడారని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. నీళ్లు పారే పొలాలు, మధిరలో రోడ్లు చూస్తే... తాను ఎలాంటి అభివృద్ధి చేశానో తెలుస్తుందని చెప్పారు. మధిరలో గెలవడం కాదు... మధిర గేటును కూడా ముట్టుకోలేవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో నీ సంగతేమిటో మధిర ప్రజలు తేలుస్తారని వార్నింగ్ ఇచ్చారు.
మధిరలో ఒక్క రోడ్డు వేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిందని... ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చావని కేటీఆర్ ను మల్లు ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పెన్షన్లను ఇచ్చామని చెప్పారు. నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ లు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబ దోపిడీతో తెలంగాణ నలిగిపోతోందని విమర్శించారు. పంటకు మద్దతు ధర అడిగిన రైతుల చేతులకు బేడీలు వేశారని మండిపడ్డారు. మహాకూటమి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తామని, కూలీబంధు పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. పేదలకు ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పారు. అమ్మహస్తం పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతామని, ఈ పథకం ద్వారా 9 రకాల సరుకులను అందిస్తామని హామీ ఇచ్చారు.