Deepika Padukone: వివాహంలో సిక్కు సంప్రదాయం ఉల్లంఘన.. దీపిక-రణ్‌వీర్ వివాహంపై వివాదం!
- ఇటలీలో ఈ నెల 14న వివాహం
- ‘ఆనంద్ కరాజ్’లో నిబంధనలు ఉల్లంఘన
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిక్కు సంఘం
ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న బాలీవుడ్ హాట్ కపుల్ దీపిక పదుకొనె-రణ్‌వీర్ సింగ్‌లను వివాదం చుట్టుముట్టింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో వివాహం చేసుకున్నారు. తొలుత కొంకణీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం 15న సింధీ సంప్రదాయంలో ఒక్కటయ్యారు. పెళ్లి సందర్భంగా నిర్వహించిన ‘ఆనంద్ కరాజ్’ కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదమైంది.
ఆనంద్ కరాజ్ కార్యక్రమం సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురుగ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదన్న నిబంధనను వారు ఉల్లంఘించారని సంస్థ అధ్యక్షుడు ఆరోపించారు. సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. దీనిపై ఫిర్యాదు నమోదైన అనంతరం ఐదుగురు అత్యున్నత మత పెద్దల వద్దకు విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు అకల్ తఖ్త్ జతేదార్ తెలిపారు.
కాగా, ఇటలీ నుంచి ఆదివారమే ముంబై చేరుకున్న దీపిక-రణ్‌వీర్‌లు రిసెప్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. బెంగళూరు, ముంబైలో మొత్తం మూడు వివాహ విందులు ఏర్పాటు చేస్తున్నారు.