Mounika Reddy: పెళ్లి చేసుకుని బంగారం, డబ్బుతో పారిపోయే కిలేడీ... ఆరుగురిని పెళ్లాడిన మౌనిక అరెస్ట్!
- పుట్టింటికని వెళ్లి మెట్టినింటిని వెతుక్కునే మౌనిక
- వెళుతూ వెళుతూ అందినంత బంగారం, డబ్బు దోపిడీ
- కడప వాసి ఫిర్యాదుతో పోలీసుల విచారణ
- నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి
నిత్య పెళ్లి కూతురిగా మారి, ఒకరి తరువాత మరొకరిని వివాహం చేసుకుంటూ, ఆపై అత్తింట్లోని బంగారం, డబ్బు తీసుకుని, తన తండ్రి, ప్రియుడి సాయంతో పారిపోయే మౌనిక అనే యువతిని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డికి మూడు నెలల క్రితం మౌనిక రెడ్డితో వివాహం జరుగగా, ఆపై నెల రోజులకే, ఆమె తన తండ్రితో కలసి పుట్టింటికని వెళ్లి అదృశ్యం కావడంతో, పోలీసులను ఆశ్రయించగా, ఈ మొత్తం బాగోతం బయటకు వచ్చింది. మౌనిక పుట్టింటికని బయలుదేరి, మరో మెట్టినిల్లు చూసుకునేదని, అలా ఇప్పటివరకూ ఆరు పెళ్లిళ్లు చేసుకుందని కడప పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా మొయిద్దీనాపురంకు చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనిక. తాము పేదలమని, కట్న కానుకలు ఇచ్చుకోలేమని చెబుతూ, డబ్బున్న సంబంధాలను ఆమె తండ్రి చూసేవాడు. అమ్మాయి అందంగా ఉండటంతో కట్నకానుకలపై ఆశలేని వారు ఆమెను పెళ్లి చేసుకునేవారు. ఆపై మెట్టినింటికి వెళ్లే మౌనిక, చాలా బాగా ఉండేది. భర్త మురిపెం సాంతం తీరకుండానే, బంగారం, డబ్బుతో ఉడాయించేది. ఆమె ఇంటికి వచ్చే తండ్రితో కలసి పుట్టింటికి బయలుదేరే ఆమె, ఇక మళ్లీ రాదు.
తీసుకున్న బంగారం, నగలతో కలసి, తన ప్రియుడు నాయక్ ను వెంటబెట్టుకుని హైదరాబాద్ చేరుకునే మౌనిక, కొద్ది రోజులు జల్సా చేసి, మరో పెళ్లికి సిద్ధమయ్యేది. కడపకు చెందిన రామకృష్ణారెడ్డి, 8 తులాల బంగారు నగలు, రూ. 30 వేల నగదు ఇచ్చి మరీ బస్టాండు వరకూ వచ్చి ఆమెను బస్సెక్కించాడు. ఆపై మామకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడం, పుట్టింటికి భార్య చేరకపోవడంతో పోలీసు కేసు పెట్టడంతో, పోలీసులు విచారించగా, ఈ నివ్వెరపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మౌనిక ఆటను కట్టించారు. మైదుకూరులో మౌనికను, హైదరాబాద్ లో నాయక్ ను, కడపలో అనంతరెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.