Roman: బయటపడిన స్పార్టన్ క్వీన్ బెడ్ రూమ్... 1వ శతాబ్దపు అద్భుత పెయింటింగ్ వెలుగులోకి!
- అగ్నిపర్వతం పేలి బూడిదైన పొంపేయి
- తాజాగా రాణి పడకగది వెలుగులోకి
- పెయింటింగ్ చూసి శాస్త్రవేత్తల సంభ్రమాశ్చర్యం
ఒకటవ శతాబ్దం నాటి అద్భుత పెయింటింగ్ ఒకటి ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. స్పార్టన్ రాణి లెడా, హంస రూపంలో ఉండే జ్యూస్ దేవుడి మధ్య లైంగిక బంధం ఉందన్న విషయం ఇంతవరకూ ఊహాగానమే కాగా, ఇప్పుడు అందుకు సంబంధించిన వర్ణ చిత్రం వెలుగులోకి వచ్చింది. ఒకటవ శతాబ్దంలో ఓ అగ్నిపర్వతం పేలిన వేళ, బూడిదలో కూరుకుపోయిన పురాతన రోమ్ నగరం పొంపేయిని గుర్తించిన శాస్త్రవేత్తలు, తవ్వకాలు సాగిస్తున్న వేళ, లేడా బెడ్ రూమ్ ను గుర్తించారు. దానిలోనే ఈ పెయింటింగ్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో అర్ధనగ్నంగా ఉన్న లెడా, ఓ కుర్చీపై కూర్చుని ఉండగా, ఆమెను తెల్లని హంస ఒకటి ముద్దాడుతూ ఉంది. ఆ కాలంలో ప్రజలు జంతువులతో లైంగిక బంధాన్ని కలిగివున్నారనడానికి ఈ చిత్రం ఓ నిదర్శనమని పొంపేయి ఆర్కియాలజికల్ పార్క్ డైరెక్టర్ మాసిమో ఒస్నాన వ్యాఖ్యానించారు. గతంలో పొంపేయి నగరంలో బయటకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే, ఇది విభిన్నంగా ఉందని ఆయన అన్నారు. కాగా, లెడాపై గ్రీస్, రోమ్ దేశాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తన అందంతో ఆమె జ్యూస్ దేవుడిని పాదాక్రాంతం చేసుకుందని నమ్ముతారు. ఆమె భర్త టైడారియస్. తన భర్తతో కలసి నిద్రిస్తున్న వేళ, హంస రూపంలో వచ్చిన జ్యూస్ ఆమెపై అత్యాచారం చేశాడన్న మరో కథ కూడా ప్రచారంలో ఉంది.