Karthik Reddy: నాడు కొడుకు కోసం అమ్మ, నేడు అమ్మ కోసం కొడుకు... సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ ల త్యాగం!
- 2014లో కార్తీక్ కోసం మహేశ్వరం సీటును త్యాగం చేసిన సబిత
- ఈ ఎన్నికల్లో తొలుత ఇద్దరికీ సీటు లభిస్తుందన్న ఆశాభావం
- పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ టీడీపీకి
- తల్లికోసం రాజీనామా నిర్ణయం వెనక్కు తీసుకున్న కార్తీక్
ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానాన్ని ఆశించి, భంగపడ్డ కార్తీక్ రెడ్డి, మెత్తబడ్డారు. పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి వెళ్లడంతో, పార్టీకి రాజీనామా చేసి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి రెబల్ గా బరిలోకి దిగుతానని చెప్పిన ఆయన, అదే జరిగితే, తన తల్లి సబితా ఇంద్రారెడ్డి విజయావకాశాలపై ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో వెనక్కు తగ్గారు. దీంతో 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ కోసం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం అసెంబ్లీ స్థానాన్ని సబితా ఇంద్రారెడ్డి వదులుకోగా, నేడు తన తల్లి పోటీ చేస్తున్న మహేశ్వరం స్థానం కోసం, తాను ఆశించిన రాజేంద్రనగర్ స్థానాన్ని వదులుకోవడం ద్వారా కార్తీక్ రెడ్డి త్యాగం చేసినట్లయింది.
2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇస్తామని స్పష్టం చేయగా, చేవెళ్ల ఎంపీగా కార్తీక్ ను నిలిపేందుకు, తన సీటును సబిత త్యాగం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం శ్రమించినా, ఆ ఎన్నికల్లో కార్తీక్ రెడ్డి గెలవలేదు. ఈ దఫా తొలుత ఇద్దరికీ టికెట్ లభిస్తుందని భావించినా, మహా కూటమి ఏర్పడటంతో ఒక సీటును వదులుకోక తప్పలేదు.