Jack Dorcey: ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీపై బ్రాహ్మణుల తీవ్ర ఆగ్రహం!
- ఇటీవల భారత్ కు వచ్చిన జాక్ డోర్సీ
- 'బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి' అన్న పోస్టర్ ప్రదర్శన
- వెల్లువెత్తిన విమర్శలతో వివరణ
భారత పర్యటనకు వచ్చిన సామాజిక మాధ్యమ దిగ్గజం సీఈఓ జాక్ డోర్సీ, "బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి" అని రాసున్న ఓ పోస్టర్ ను ప్రదర్శించడంపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొందరు సామాజిక కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులతో సమావేశమైన ఆయన, ఈ పోస్టర్ ప్రదర్శించగా, అందులో పాల్గొన్న ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని షేర్ చేశారు.
దీనిపై అగ్గిమీద గుగ్గిలమైన బ్రాహ్మణులు, వామపక్ష వాదులతో ఎందుకు సమావేశం అయ్యారని జాక్ డోర్సీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ఒకే వర్గానికి కొమ్ము కాస్తుందా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. జాక్ కావాలనే ఆ పోస్టర్ ను పట్టుకోలేదని, అక్కడికి వచ్చిన ఓ దళిత కార్యకర్త, తన అనుభవాలు వివరించిందని, ఆ పోస్టర్ ను జాక్ కు ఆఫర్ చేయడంతో ఆయన పట్టుకున్నారంతేనని వివరణ ఇచ్చింది. తమకు అన్ని వర్గాల ప్రజలు కావాలని, అందరి వాదనలూ వింటామని పేర్కొంది.