Ponnala Lakshmaiah: పొన్నాల లక్ష్మయ్య భార్యను అడ్డుకున్న ఏసీపీ.. సస్పెండ్ చేయిస్తానంటూ ఏసీపీకి ఈసీ అబ్జర్వర్ వార్నింగ్
- పొన్నాల నామినేషన్ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా వచ్చిన ఆయన భార్య
- గేటు బయటే అడ్డుకున్న ఏసీపీ వినోద్ కుమార్
- అరుణాదేవిని లోపలకు పంపించిన జిల్లా కలెక్టర్
నామినేషన్లకు చివరిరోజైన నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నామినేషన్ కేంద్ర పరిసరాలు పార్టీ నేతలు, కార్యకర్తలతో నిండిపోయాయి. పార్టీ నేతలతో కలసి పొన్నాల నామినేషన్ కేంద్రంలోకి వెళ్లారు. ఆయన భార్య అరుణాదేవి కొంచెం ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. దాంతో నామినేషన్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆమెను ఏసీపీ వినోద్ కుమార్ గేట్ బయటే అడ్డుకున్నారు. నలుగురికి మించి లోపలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. తాను పొన్నాల భార్యనని, నామినేషన్ ప్రతిపాదకురాలిగా లోపలకు వెళ్తున్నానని చెప్పినా... ఏసీపీ వినలేదు. ఈ క్రమంలో ఇద్దరికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
న్యూసెన్స్ చేస్తే కేసులు పెడతామని ఈ సందర్భంగా అరుణాదేవిని ఏసీపీ హెచ్చరించారు. ఇలాంటి వాటికి భయపడనని ఆమె కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. తాను మాజీ డీఎస్పీ కూతురుననే, కావాలని అవమానిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అక్కడే ఉన్న ఎన్నికల కమిషన్ స్టేట్ జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర చోలే... ఈ గొడవను గమనించి, వెంటనే వారి వద్దకు వచ్చారు. ఏసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేయిస్తానంటూ హెచ్చరించారు. గొడవ గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. అరుణాదేవిని లోపలకు పంపించారు. అనంతరం నామినేషన్ కేంద్రం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు.