Maharashtra: మహారాష్ట్ర ఆయుధాల డిపోలో భారీ పేలుడు!
- పుల్గావ్ ఆయుధ గోడౌన్ లో ప్రమాదం
- ఆరుగురి మృతి, పది మందికి గాయాలు
- ఎక్స్ పైర్ అయిన మందుగుండును నిర్వీర్యం చేస్తుండగా ఘటన
మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఉన్న ఆయుధాల గోడౌన్ లో ఘోర ప్రమాదం జరిగింది. సైన్యం నిర్వహణలో ఉన్న ఈ గోడౌన్ లో పేలుడు జరిగి ఆరుగురు మరణించగా, మరో 10 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. వార్దా సమీపంలోని పుల్గావ్ లో గల ఆర్మీ ఆయుధ గోదాంలో గడువు తీరిపోయిన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయని, ముగ్గురు కూలీలు, ఓ అధికారి, మరో ఇద్దరు జవాన్లు మృతిచెందారని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
కాగా, పుల్గావ్ ఆయుధ గోడౌన్ లో గతంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. 2016 మేలో భారీ అగ్నిప్రమాదం జరిగి 16 మంది రక్షణ శాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యానికి చెందిన అతిపెద్ద ఆయుధ గోడౌన్ గా సేవలందిస్తున్న పుల్గావ్ గోడౌన్ లో శక్తిమంతమైన బాంబులు, గ్రనైడ్లు, తుపాకులు, తదితర పేలుడు పదార్థాలను నిల్వ చేసి, ఇక్కడి నుంచే సైనికులకు సరఫరా చేస్తుంటారు.