Chandrababu: కేసీఆర్ విమర్శలపై తొలిసారి స్పందించిన చంద్రబాబు.. వాస్తవాలు వివరించేందుకు స్టేటస్ నోట్ తయారుచేయాలంటూ అధికారులకు ఆదేశం
- సాగునీటి ప్రాజెక్టులను ఏపీ అడ్డుకుంటోందంటూ టీఆర్ఎస్ ప్రచారం
- తెలుగు ప్రజలకు వాస్తవాలు వివరిద్దామన్న చంద్రబాబు
- స్టేటస్ నోట్‌ను తయారుచేయాలంటూ జలవనరుల శాఖకు ఆదేశం
ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత తనపై చేస్తున్న విమర్శలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలిసారి స్పందించారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శల్లో నిజానిజాల్ని ప్రజలకు తెలియజేసేందుకు స్టేటస్ నోట్‌ను తయారు చేయాల్సిందిగా జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటోందని, అభ్యంతరాలతో కేంద్రానికి లేఖలు రాసి అడ్డుకుంటోందని హరీశ్ రావు, కేటీఆర్ ఇటీవల ఎన్నికల సభల్లో తరచూ ఆరోపణలు చేస్తున్నారు. ఖమ్మం సభలో కేసీఆర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. జిల్లాకు మేలు చేసే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని బాబు సర్కారు అడ్డుకుంటోందని ఆరోపిస్తూ ఓ లేఖను చూపించారు. ఎన్నికల ప్రచారానికి వస్తే చంద్రబాబును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
తనను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుండడంపై చంద్రబాబు తొలిసారి స్పందించారు. మంగళవారం రాత్రి జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో ఉండవల్లిలోని ప్రజావేదిక దర్బారులో సీఎం సమావేశమయ్యారు. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం విధానమేంటో రెండు రాష్ట్రాల ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన స్టేటస్ నోట్‌ను తయారుచేయాల్సిందిగా ఆదేశించారు. కేంద్రానికి రాసిన లేఖల్లోని అంశాలను ప్రజలకు వివరించి, వాస్తవాలు తెలియజెప్పేలా స్టేటస్ నోట్‌ను తయారుచేయాలని సూచించారు.