electric shock: నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొన్న హీటర్‌.. విద్యుదాఘాతంతో మృతి

  • విశాఖ జిల్లా కశింకోట మండలం పరవాడపాలెంలో ఘటన
  • నీరు వేడి చేస్తుండగా ఆడుకుంటూ వెళ్లి తాకిన చిన్నారి
  • ఏకైక బిడ్డ మృతితో తీరని విషాదంలో తల్లిదండ్రులు

తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. కరెంట్ హీటర్‌తో నీరు వేడి చేస్తుండగా అందులో చేతులు పెట్టిన చిన్నారి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. విశాఖ జిల్లా కశింకోట మండలం పరవాడపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి.

గ్రామానికి చెందిన గొంతిన పడమటయ్య, నాగరత్నం దంపతులు. పడమటయ్య ఇనుప గమేళాలు తయారు చేసి జీవనోపాధి పొందుతున్నాడు. పెళ్లయిన చాలా ఏళ్ల వరకు ఈ దంపతులకు పిల్లల్లేరు. పిల్లల కోసం గుడులు గోపురాలు తిరిగారు. నోములు వ్రతాలు చేశారు. వారి పూజలు ఫలించి నాలుగేళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గాయత్రి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

ఇటీవలే చిన్నారిని స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చారు. ఉదయం కూతురిని అంగన్‌వాడీకి తయారు చేసే పనుల్లో భాగంగా బకెట్‌లో నీరుపోసి అందులో హీటర్‌ ఉంచి ఇతర పనుల్లో నిమగ్నమైపోయారు. బకెట్‌కు సమీపంలో ఆడుకుంటున్న గాయత్రి  బకెట్‌ వద్దకు వెళ్లింది. నీళ్లను ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై స్పృహతప్పి పడిపోయింది. ఆ సమయానికి సమీపంలో ఎవరూ లేకపోవడంతో పాప పరిస్థితిని ఎవరూ గమనించలేదు.

కాసేపటికి విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి గతుక్కుమన్నారు. వెంటనే హీటర్‌ ఆఫ్‌ చేసి బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరుగు తీశారు. అయితే అప్పటికే గాయత్రి మృతి చెందిందని చెప్పడంతో భోరుమన్నారు.

  • Loading...

More Telugu News