Noida: నోయిడా నుంచి పుణెకి సామగ్రి బుక్ చేసిన టెక్కీ... నరకం చూపించిన 'మూవర్స్ అండ్ ప్యాకర్స్'!

  • రూ. 60 వేలకు సామాన్లు చేరవేసేందుకు కాంట్రాక్టు
  • రెండు వారాలు దాటినా చేరని ట్రక్
  • లారీ డ్రైవర్ ఇలా ఎందరినో మోసం చేశాడన్న పోలీసులు

ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి, నోయిడా నుంచి పుణెకు మకాం మార్చిన వేళ, ఓ మూవర్స్ అండ్ ప్యాకర్స్ సంస్థ చుక్కలు చూపించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 31 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్, పుణెకు వెళుతూ, తన ఇంట్లోని సామానులను అక్కడికి చేరవేసేందుకు ఆన్ లైన్ ద్వారా ఓ ప్యాకింగ్ సంస్థను సంప్రదించి, రూ. 61 వేలకు డీల్ ను కుదుర్చుకున్నాడు. ఆపై ఆయన కుటుంబం మొత్తం పుణెకు చేరుకున్న తరువాత రెండు వారాలైనా సామాన్లు రాలేదు.

"ఇంట్లోని సామాను, ఎలక్ట్రానిక్ వస్తువులు, నా సర్టిఫికెట్లు, ఎన్నో విలువైన డాక్యుమెంట్లను ట్రక్ లోకి ఎక్కించారు. అక్టోబర్ 24న బయలుదేరిన ట్రక్, 28కి పుణెకు చేరాల్సి వుంది. నేను, నా కుటుంబీకులు పుణెకు వచ్చి పదిహేను రోజులు ఎదురు చూశాం. ఆ ట్రక్ డ్రైవర్ నాకు ఫోన్ చేసి, తన యజమాని డబ్బు చెల్లించలేదని, తనకు రూ. 30 వేలు ఇవ్వకుంటే, సామానంతా తగలేస్తానని బెదిరించాడు. ఆపై నేను నోయిడా, పుణె పోలీసులను ఆశ్రయించాను" అని చెప్పాడు.

ఈ కేసును విచారించిన పోలీసులు, మూవర్స్ అండ్ ప్యాకర్స్ యజమాని, లారీకి డ్రైవర్ గా వచ్చిన వ్యక్తి ఒకరేనని తేల్చడం గమనార్హం. ఆ వ్యక్తి, తనను సంప్రదించిన వారిని ఇలానే మోసం చేస్తుంటాడని, అతని ఫోన్ నంబరును తరచూ మారుస్తుంటాడని తేల్చారు. నోయిడాలోనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, టెక్కీ సామాన్లను అతనికి ఇప్పించి, నిందితుడిని రిమాండుకు పంపించారు. 

  • Loading...

More Telugu News