Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం అంతులేని వివక్ష చూపుతోంది.. మేం ప్రత్యేక హోదా ఇచ్చితీరుతాం!:మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
- మన్మోహన్ ఇచ్చిన హామీని మోదీ నెరవేర్చలేదు
- రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిస్తాం
- వైసీపీ, జనసేనలు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి
పార్లమెంటులో ప్రధానమంత్రి హామీ ఇస్తే దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఆ తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వంపై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారశైలి దారుణంగా ఉందని విమర్శించారు. ఏపీపై కేంద్రం అంతులేని వివక్ష చూపుతోందని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈ రోజు ఓ కార్యక్రమానికి హాజరైన కిరణ్ మీడియాతో మాట్లాడారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కిరణ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2014లో ఇచ్చిన హోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎవరితో కలిసి ముందుకు వెళ్లాలో వైసీపీ, జనసేన పార్టీలు తేల్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సాధిస్తామని పేర్కొన్నారు.