paruchuri: ఆ డైలాగ్ ను మార్చేసి రాస్తే అప్పుడు పేలింది: పరుచూరి గోపాలకృష్ణ
- వేజెళ్ల గారికి ఆ డైలాగ్ నచ్చింది
- ఆ రాత్రి నేను భోజనం చేయలేదు
- భాష విషయంలో స్పష్టత వచ్చింది
ఎన్నో సినిమాలకి కథలను .. మాటలను అందించిన పరుచూరి గోపాలకృష్ణ, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ 'ఈ చరిత్ర ఏ సిరాతో' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాలో నేను రాసిన ఒక డైలాగ్ వేజెళ్ల గారికి బాగా నచ్చేసి అభినందించారు. ఆనందంతో కడుపునిండిపోయి ఆ రాత్రి అన్నం కూడా తినలేదు.
'కనురెప్ప కిందికి దిగితే వినయం .. పైకి లేస్తే విప్లవం .. రెప్పపాటు దూరంలో దోపిడీ జరిగిపోతోంది' అనేది ఆ డైలాగ్. కానీ థియేటర్లో ఈ డైలాగ్ కి ఎవరూ చప్పట్లు కొట్టలేదు. అప్పుడు 'వజ్రాయుధం' సినిమాలో ఈ డైలాగ్ ను మార్చేసి 'పేదోడికి నోరుంటది బాబూ .. ఆకలేసినప్పుడు అమ్మా అంటది .. కోపం వచ్చినప్పుడు నీ యమ్మా అంటది' అని రాశాను. థియేటర్లో అరుపులు .. కేకలు .. ఈలలు. భాష విషయంలో రచయితగా అప్పుడు నాకు ఒక స్పష్టత వచ్చింది" అని చెప్పుకొచ్చారు.