akshay kumar: సిట్ విచారణకు హాజరైన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్!
- అక్షయ్ మెడకు సెటిల్మెంట్ వ్యవహారం కేసు
- డేరా బాబా-మంత్రి బాదల్ సంబంధాలపై విచారణ
- చండీగఢ్ లో అధికారుల ముందు హాజరు
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చండీగఢ్ లో ఈ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. 2015లో పంజాబ్ లోని కోట్కాపురా, బెహ్బాల్ ఖాన్ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 60 మంది చనిపోయారు. ఈ కేసులో శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీమ్ తో పాటు హీరో అక్షయ్ కుమార్ పాత్రపై సిట్ విచారణ జరపనుంది.
2015లో అక్షయ్ కుమార్ ఇంట్లో సుఖ్ బీర్ సింగ్ బాదల్, డేరా బాబా సమావేశమైనట్లు ఈ కాల్పులపై ఏర్పాటైన జస్టిస్ రంజన్ సింగ్ కమిషన్ తేల్చింది. డేరా బాబా హీరోగా ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ అనే సినిమాను తీశారు. సినిమాలో దైవదూషణ ఉందంటూ పలువురు సిక్కులు ఆందోళనకు దిగగా, పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అక్షయ్ ఫ్లాట్ లో సమావేశమైన డేరా బాబా, బాదల్ ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.
ఈ ఒప్పందంలో భాగంగా మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమా రిలీజ్ తో పాటు అప్పటికే నడుస్తున్న అత్యాచారం కేసు విషయంలో సహకరించేందుకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు డేరా బాబా అంగీకరించారు. అయితే తాను ఎన్నడూ బాదల్, గుర్మీత్ లను కలవలేదని అక్షయ్ కుమార్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు అక్షయ్ చండీగఢ్ వచ్చాడు.