kcr: ఇద్దరి రోగం కుదరాలంటే.. ‘ఓటు’తో దెబ్బ కొట్టండి: సీఎం కేసీఆర్
- ‘కత్తి ఆంధ్రావాడిదే కానీ, పొడిచేటోడు తెలంగాణా వాడు’
- వచ్చేటోడు ఆంధ్రావాడే, వాన్ని తెచ్చేటోడు టీ- కాంగ్రెస్
- వాస్తవం చెప్పాలంటే.. మెదక్ లో పోటీయే లేదు
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఘాటు విమర్శలు చేశారు. మెదక్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబును భుజాన మోసుకుని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తోందని, అధికారం కోసం ఎంత నీచానికైనా కాంగ్రెస్ నాయకులు దిగజారతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్వతంత్రంగా ఉన్న తెలంగాణను, సాధించుకున్న తెలంగాణను మళ్లీ చంద్రబాబు నాయుడి నాయకత్వం కింద పెడతారట అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలందరూ దరఖాస్తులు పట్టుకుని విజయవాడకు పోయే గతి రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తను చెప్పిన ఓ వాక్యం గురించి కేసీఆర్ ప్రస్తావించారు.
‘కత్తి ఆంధ్రావాడిదే కానీ, పొడిచేటోడు తెలంగాణా వాడు’ అని గుర్తుచేశారు. ‘ఇవాళ వచ్చేటోడు ఆంధ్రావాడే, కానీ, వాన్ని భుజాన మోసుకుని తెచ్చేటోడు తెలంగాణ కాంగ్రెస్. వీనిది, వానిది ఇద్దరిదీ రోగం కుదరాలంటే.. ‘ఓటు’తో దెబ్బకొట్టాలి. వాస్తవం చెప్పాలంటే.. ఈరోజున మెదక్ లో పోటీయే లేదు. పద్మాదేవేందర్ రెడ్డిని లక్ష మెజార్టీకి తగ్గకుండా గెలిపించాలి.. పద్మకు మరింత ఉన్నతమైన స్థానం రావాలి’ అని కేసీఆర్ అన్నారు.