Chandrababu: మోదీ సర్కార్ వ్యవస్థలను నాశనం చేసింది: సీఎం చంద్రబాబు
- ‘రాఫెల్’ కుంభకోణం మోదీ సర్కార్ ఘనతే
- టీఆర్ఎస్, వైసీపీ, జనసేన లు బీజేపీతో కలిసి కుట్ర
- చల్లపల్లి గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు
కృఫ్ణా జిల్లా చల్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు పర్యటించారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించారు. గ్రామస్థులు నిర్మించిన పార్క్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా గాంధీ స్మృతి వనాన్ని ప్రజలకు అంకితం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. కోగంటి చిత్రలేఖ అనే వృద్ధురాలు అమరావతి రాజధానికి రూ.12 వేలు విరాళంగా ఇచ్చారు.
చల్లపల్లి బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఎదురుమొండి-ఏటిమెుగ మధ్య వారధి నిర్మాణానికి, బీమా కాలువపై ఎత్తిపోతల పథకానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, వైసీపీ, జనసేన పార్టీలపై ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ, జనసేన పార్టీలు ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి తమపై కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. మోదీ సర్కార్ వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. ‘రాఫెల్’ కుంభకోణం మోదీ సర్కార్ ఘనతేనని, సీబీఐ, ఈడీలతో తమను భయపెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని, అది సాధ్యమయ్యే పని కాదని అన్నారు.
కాగా, కోడూరు మండలంలోని ఉల్లిపాలెంలో నిర్వహించిన ‘గ్రామదర్శిని’లో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ఉల్లిపాలెం-భవానీపురం వంతెన నిర్మాణంతో దివిసీమ దశదిశా మారిపోతుందని, ఈ ప్రాంతం పర్యాటకం సహా ఇతర రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆరోగ్యానికి మారుపేరుగా గ్రామాలను తయారు చేస్తున్నామని, అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టామని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.