t-congress: నేను పార్టీ కండువా మార్చుకోవడమనేది ఈ జన్మలో చూడలేరు: కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్
- టికెట్ రాలేదని చెప్పి పార్టీ మారే మనస్తత్వం నాది కాదు
- పొత్తుల్లో నేను అనుకున్న నియోజకవర్గం పోయింది
- రాజేంద్రనగర్ లో మా మిత్రపక్షం గెలుపు ఖాయం
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, తాను చచ్చిపోయే వరకు ఈ పార్టీలోనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి స్పష్టం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు ఎంతో ఇష్టమైన వాళ్లనే కాదనుకుని కాంగ్రెస్ పార్టీలో చేరానని, టికెట్ రాలేదని చెప్పి పార్టీ మారే మనస్తత్వం తనది కాదని, కండువాలు మార్చే వ్యక్తిని కాదని అన్నారు.
‘బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం.. కండువా మార్చుకోవడమనేది ఈ జన్మలో మీరు చూడలేరు’ అని అన్నారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా తాను పోటీ చేద్దామనుకున్న నియోజకవర్గం పోయిందని, కాంగ్రెస్ పార్టీ తనను పిచ్చోణ్ని చేసిందని, మోసం చేసిందని అనుకోవట్లేదని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తొలుత భావించానని, అక్కడ వద్దన్నారని, రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పమన్నారని, పొత్తుల్లో భాగంగా ఆ నియోజకవర్గం తమకు దక్కలేదని అన్నారు. రాజేంద్రనగర్ లో తమ మిత్ర పక్షం తప్పకుండా గెలుస్తుందని, అక్కడ ప్రచారం చేస్తానని చెప్పారు.