Jammu And Kashmir: జమ్ముకశ్మీర్లో అనూహ్య పరిణామాలు.. శాసనసభను రద్దు చేసిన గవర్నర్
- ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, పీపుల్స్ కాన్ఫరెన్స్ ముందుకు
- ఆ తర్వాత కాసేపటికే గవర్నర్ నిర్ణయం
- కేంద్రం తీరుపై విమర్శలు
జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అనూహ్యంగా శాసనసభను రద్దు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు పీడీపీ-కాంగ్రెస్ కూటమి, బీజేపీ మద్దతుతో పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చి లేఖలు ఇచ్చిన కొన్ని గంటలకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది.
ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన కొనసాగుతోంది. పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగినప్పటి నుంచి అంటే ఈ ఏడాది జూన్ నుంచి అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. అప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గవర్నర్ తాజా నిర్ణయంతో డిసెంబరు 18 తర్వాత జమ్ముకశ్మీర్ కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నిలతోపాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాగా, భయంతోనే బీజేపీ ఈ అసెంబ్లీని రద్దు చేయించిందని, ఇది కాకతాళీయంగా తీసుకున్న నిర్ణయం కాదని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.