Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై దాడి ఘటన ఓ డ్రామా .. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ
- సానుభూతి కోసం కేజ్రీవాల్ డ్రామా
- సీఎం ఆఫీసు నుంచి ఆదేశాలు వెళ్లాకే దాడి
- ప్రతీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌పై దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సచివాలయంలో కారంపొడితో జరిగిన దాడి పూర్తిగా నాటకమని బీజేపీ ఆరోపించింది. సానుభూతి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ రచించిన పన్నాగమని కొట్టిపడేసింది. 2013 అసెంబ్లీ, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ కేజ్రీవాల్‌పై ఇటువంటి ఘటనలే జరిగాయని బీజేపీ ఢీల్లీ చీఫ్ మనోజ్ తివారీ గుర్తు చేశారు.
మంగళవారం సచివాలయంలోని కేజ్రీవాల్ కార్యాలయం బయట ఓ వ్యక్తి సీఎంపై కారం జల్లాడు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తాజాగా, మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌పై దాడిచేసిన వ్యక్తికి సీఎం ఆఫీసుతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్లాన్‌ను అమలు చేయమని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన తర్వాతే అతడిని సెక్రటేరియట్‌లోకి అనుమతించారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీ ఎన్నికలకు ముందు సానుభూతి కోసం ఇటువంటి పనులు చేయించుకోవడం ‘ఆప్’కు అలవాటేనని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది కొత్త డ్రామా అని మనోజ్ తివారీ ఎద్దేవా చేశారు.