Telangana: నామినేషన్ల ఉపసంహరణకు నేటితో ఆఖరు.. కొండెక్కి కూర్చున్న రెబల్స్.. కోట్లలో డిమాండ్
- నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
- రెబల్స్‌తో ప్రధాన పార్టీల చర్చలు
- రూ. 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న రెబల్స్
ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో ఇప్పుడు వివిధ పార్టీలన్నీ మరో పనిలో బిజీగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుండడంతో పార్టీలన్నీ రెబల్స్ కరుణాకటాక్షాల కోసం ఎదురుచూస్తున్నాయి. బుజ్జగింపులతో వారిని ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న రెబల్స్ కొండ దిగేందుకు మారాం చేస్తున్నారు.
అడిగినంత సమర్పించుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే మీ ఇష్టమంటూ కరాఖండీగా తేల్చి చెప్పేస్తున్నారు. అభ్యర్థి, పార్టీని బట్టి లక్షల నుంచి కోట్ల ధర పలుకుతున్నట్టు సమాచారం. ప్రధాన పార్టీ రెబల్ అభ్యర్థులైతే కనీసం రూ. 20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అంతమొత్తం ఇచ్చుకోలేమని కాస్త రిబేటు ఇవ్వాలని ప్రధాన అభ్యర్థులు బతిమాలుతున్నట్టు చెబుతున్నారు.
అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఎంతోకొంత వెనకేసుకోవాలనే పట్టుదలతో ఉన్న రెబల్స్ అడిగినంత ఇవ్వకుంటే ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ స్థానం నుంచి నామినేషన్ వేసిన రెబల్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకునేందుకు రూ. 20 కోట్లు డిమాండ్ చేయగా, అతడిని బతిమాలి, బామాలి రూ. 3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ మధ్యాహ్నం వరకు ఉపసంహరణకు గడవు ఉండడంతో రెబల్స్‌తో అన్ని ప్రధాన పార్టీలు రహస్య చర్చల్లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. డబ్బులతో పాటు అధికారంలోకి వస్తే పార్టీ పదవులు కూడా ఇస్తామని కూడా ఆశపెడుతున్నట్టు చెబుతున్నారు.