chief election commissioner: ఏర్పాట్ల పరిశీలనకు.. నేడు హైదరాబాద్ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు
- ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో బృందం రాక
- పార్టీ పత్రినిధులతో భేటీ కానున్న సంఘం
- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో నిమగ్నమవుతోంది. డిసెంబరు 7న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓ.పి.రావత్ ఆధ్వర్యంలో ఓ బృందం గురువారం హైదరాబాద్ వస్తోంది. ఎన్నికల బరిలో ఉన్న ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎన్నికల ఏర్పాట్లు, భద్రతాపరమైన అంశాలపై సమీక్షించనుంది.
ఇదిలావుండగా వనపర్తి టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. నిరంజన్‌రెడ్డి వనపర్తి జిల్లా ఎర్రగుట్ట తండాకు కృష్ణా జలాలు విడుదల చేసి ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ప్రధానాధికారి రావత్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. దీంతో నివేదిక అందించాలని రాష్ట్ర సంఘం కలెక్టర్‌ను కోరింది.