Malreddy Rangareddy: ఆఖరి క్షణంలో మరో సీటును వదులుకున్న టీడీపీ... 13 కాదు 12 చోట్లే పోటీ!
- గత రాత్రి మల్ రెడ్డి సోదరుల మధ్య చర్చలు
- తప్పుకునేందుకు అంగీకరించిన రామిరెడ్డి
- మల్ రెడ్డి రంగారెడ్డితో పోటీ పడలేనన్న సామ రంగారెడ్డి
- నేడు నామినేషన్ ఉపసంహరణ
- మల్ రెడ్డికి మద్దతివ్వాలని మహాకూటమి నిర్ణయం
టీఆర్ఎస్ ను ఓడించాలన్న లక్ష్యంతో మహాకూటమిలో భాగస్వామిగా మారిన తెలుగుదేశం తొలుత 14 సీట్లలో పోటీకి సిద్ధమై, ఆపై మరో సీటును వదులుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆఖరి క్షణంలో జరిగిన మార్పుల కారణంగా టీడీపీ మరో స్థానాన్ని కూటమికి వదిలేసుకుని 12 సీట్లకే పరిమితమైంది. ఇష్టం లేకుండానే ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి తప్పుకోవాలని నిర్ణయించారు. దీంతో ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ తరఫున నిలబడిన మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతివ్వాలని మహాకూటమి నిర్ణయించింది.
గత రాత్రి ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ నేతల మధ్య చర్చలు సాగగా, మల్ రెడ్డి రామిరెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుల మధ్య రాజీ కుదిరి, రామిరెడ్డి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆపై రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ఇప్పటికే మల్ రెడ్డి రంగారెడ్డితో పోటీ పడితే, తన విజయావకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్న సామ రంగారెడ్డి, తప్పుకుంటున్నట్టు చెప్పేశారు.
దీంతో ఇబ్రహీంపట్నంలో బరిలో ఉన్న మల్ రెడ్డి సోదరుల్లో ఒకరికి మద్దతు పలకాలని కాంగ్రెస్ నిర్ణయించుకోగా, ఇప్పుడు రామిరెడ్డి తప్పుకోవడంతో, మల్ రెడ్డి రంగారెడ్డికి మార్గం సుగమం కాగా, టీడీపీ 12 స్థానాలకు పరిమితమైంది. కాగా, సామ రంగారెడ్డి నేడు తన నామినేషన్ ను ఉపసంహరించుకోనున్నారు.