tirumala: భారీ వర్షాలు.. తిరుమల కనుమ దారిలో విరిగిపడ్డ కొండచరియలు!
- చిత్తూరు, నెల్లూరు, ఉత్తర తమిళనాడులో భారీ వర్షం
- తిరుమలలో తిరువీధులు, రహదారులు జలమయం
- విరిగిపడ్డ కొండచరియలను తొలగించిన సిబ్బంది
అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను వర్షం ముంచెత్తింది. భారీ వర్షాలతో తిరువీధులు, రహదారులు జలమయమయ్యాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాల ధాటికి తిరుమల కనుమ దారిలో అక్కడక్కడ కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ భద్రతాసిబ్బంది కొండచరియలను తొలగించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న చోట్ల ముందస్తు చర్యల్లో భాగంగా... జేసీబీలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు ఉత్తర తమిళనాడును కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడులోని ఆరు జిల్లాలతో పాటు, పుదుచ్చేరిలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.