Jagan: మీ మేనిఫెస్టో 7వ పేజీలోని హామీ సంగతేంటి?: చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసిన జగన్!
- జగన్ ను కలిసిన 110 ఏళ్ల వృద్ధుడు
- నిరాశ్రయులైన అవ్వాతాతలకు వృద్ధాశ్రమాలు ఏవి?
- హామీ ఇచ్చి, అమలు మరిచారని జగన్ విమర్శలు
ప్రస్తుతం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, తన దృష్టికి వచ్చిన ఓ సమస్యపై స్పందిస్తూ, చంద్రబాబును తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా నిలదీశారు. టీడీపీ తన మేనిఫెస్టోలోని 7వ పేజీ ముఖ్యాంశాల్లో నియోజకవర్గానికి ఓ వృద్ధాశ్రమం కట్టిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ, దాని సంగతేమైందని ప్రశ్నించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ సుదీర్ఘ పోస్టును పెట్టారు. జగన్ పోస్టు యథాతథంగా...
"విశ్వమానవ ప్రేమ, దాతృత్వం, దయాగుణాలను పెంచే మహ్మద్ ప్రవక్త బోధనలు నిత్య అనుసరణీయాలు. ఆయన జన్మదినం సందర్భంగా.. మైనార్టీ సోదరుల కుటుంబాల్లో సుఖసంతోషాల వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్నటి పాదయాత్ర మొదలుపెట్టాను.
మిలాద్ ఉన్ నబీ రోజున శిబిరం నుంచి బయటకు రాగానే చినమేరంగికి చెందిన షేక్ రేష్మా, దిల్షాద్, నూరి, నూర్జహాన్‌లు కలిశారు. ఆ పేద ముస్లిం కుటుంబం.. బాబుగారి షాదీముబారక్ పథకాన్ని నమ్ముకుని ఆ ఇంటి ఆడపడుచుకు జనవరిలో పెళ్లిచేసింది. ఆయనగారు చెప్పినట్టు రూ.75 వేలు వస్తాయనుకున్నారు. పెళ్లయిన నెలలోపే అన్ని ధ్రువీకరణ పత్రాలిచ్చి, దరఖాస్తు చేసుకున్నప్పటికీ షాదీముబారక్ పథకం చేయూత అందలేదు. అప్పుచేసి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టుకోలేక అల్లాడిపోతున్నామని బాధపడ్డారు. బాబుగారి హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమని వాపోయారు.
నాలుగున్నరేళ్ల పాటు మైనార్టీలను దారుణంగా విస్మరించి.. తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడేప్పటికి మూడు నెలల మంత్రి పదవి ఇచ్చి.. మైనార్టీలను మరోమారు మభ్యపెట్టాలనుకుంటున్న బాబుగారి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?!
అల్లువాడ వద్ద సింహాద్రి, నారాయణమ్మ అనే వృద్ధ దంపతులు కలిశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆ తాతకు 110 ఏళ్లట. కంటిచూపు సరిగా లేదు.. వినికిడి అంతంత మాత్రమే.. నడవడమూ కష్టమే. ‘తాతా.. బావున్నావా..’అని పలకరించగానే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘కన్నబిడ్డల్లేరు.. అయినవారెవరూ లేరు.. పలకరించేవారూ కరువే. ఎంతకాలమయ్యా ఈ ఒంటరి బతుకులు’.. అంటూ నిర్వేదంగా మాట్లాడాడు. గుండె బరువెక్కింది. అంతబాధలోనూ ‘బాబూ.. మీ నాన్నలా మంచిపేరు తెచ్చుకోవాలి’ అంటూ దీవించాడు. ఎవరూ లేని ఇలాంటి అవ్వాతాతల ఆలనాపాలనా చూసుకునేందుకు వృద్ధాశ్రమాలుంటే ఎంత బావుండేది అనిపించింది.
గుమ్మలక్ష్మీపురానికి చెందిన గిరిజనులు వాళ్ల సంప్రదాయ పంటలు, అటవీ ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన స్టాల్‌ను చూపించారు. దాదాపు 36 రకాల అటవీ ఉత్పత్తులు పండుతాయట. గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేస్తోంది మాత్రం పసుపు, చింతపండే.. అది కూడా అరకొరగానే. మార్కెటింగ్ సదుపాయాల్లేక, గిరిశిఖర గ్రామాల నుంచి రవాణా సౌకర్యాల్లేక, కోల్డ్ స్టోరేజీల్లేక.. విధిలేని పరిస్థితుల్లో దళారీలకు బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంప్రదాయ పంటలు ఆరోగ్యానికి చాలా మంచివని.. బయట మార్కెట్లో అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. అవి పండించిన గిరిజన రైతన్న మాత్రం దోపిడీకి గురవుతున్నాడు. గోదావరి జిల్లాలకు చెందిన శెట్టిబలిజ నేతలు వచ్చి పార్టీలో చేరారు. ఇన్నాళ్లూ బలహీనవర్గాలను ఓటు బ్యాంకులుగానే చూస్తున్న బాబుగారిపై భ్రమలు పోయాయని చెప్పారు.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ మేనిఫెస్టోలోని ఏడో పేజీలో ముఖ్యాంశాలంటూ.. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం కట్టిస్తానని గొప్పగా హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వృద్ధాశ్రమమైనా కట్టించారా? గిరిజనుల వద్ద కిలో చింతపండు కేవలం రూ.20కే కొంటున్నారు.. మీ హెరిటేజ్‌లో మాత్రం కిలో రూ.326కు అమ్ముతున్నారు.. మరి దీనికేం సమాధానం చెబుతారు?" అని జగన్ ప్రశ్నించారు.