vijayasanthi: ఎవరికి ప్రచారం చేయాలో అర్థం కావడం లేదు: విజయశాంతి
- కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీజేఎస్ అభ్యర్థులిద్దరూ బరిలో ఉన్నారు
- ఈ సందిగ్ధత కారణంగా కొన్ని జిల్లాల్లో ప్రచారం నిలిచిపోయింది
- కాంగ్రెస్ నాయకత్వం దీనిపై ఒక స్పష్టతను ఇవ్వాలి
తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో మహాకూటమిలోని పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీజేఎస్ అభ్యర్థులిద్దరూ బరిలో ఉండటంతో... ఎవరి తరపున ప్రచారం చేయాలో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ఈ సందిగ్ధత కారణంగా మెదక్, వరంగల్ తో పాటు కొన్ని జిల్లాల్లో ప్రచారం నిలిచిపోయిందని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టతను ఇవ్వాలని కోరారు.
మరోవైపు మహాకూటమి తరపున ఒక నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి ఉండేలా చూడాలని టీజేఎస్ అధినేత కోదండరాం కోరారు. స్నేహపూర్వక పోటీ ఉండకుండా చూడాలని చెప్పారు. కాంగ్రెస్ పై బరిలోకి దింపిన తమ అభ్యర్థులను కూడా ఉపసంహరింపజేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిందని... స్నేహపూర్వక పోటీలు కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.