whatsapp: గురుగ్రామ్ కేంద్రంగా వాట్సాప్ దేశీయ విభాగం...అధిపతిగా అభిజిత్ బోస్ నియామకం
- పేమెంట్స్ సంస్థ ఇజెటాప్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న బోస్
- కాలిఫోర్నియా బయట వాట్సాప్‌కు ఇదే మొట్టమొదటి కేంద్రం
- చిన్నాపెద్దా వ్యాపారులతో మమేకమయ్యే పనిలో బోస్ బృందం
త్వరలో వాట్సాప్ ఇండియా కేంద్రం ఏర్పాటవుతోంది. కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ తొట్టతొలిసారి కాలిఫోర్నియా బయట తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. భారత్‌లోని హర్యానాలోని గురుగ్రామ్‌లో తన వాట్సాప్ ఇండియా కేంద్రాన్ని నెలకొల్పుతోంది. నకిలీ సందేశాలను నిరోధించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వాట్సాప్‌పై భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ ఏర్పాటు కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ఈ కేంద్రానికి అధిపతిగా అభిజిత్ బోస్‌ను నియమించింది. ప్రస్తుతం పేమెంట్స్ సంస్థ ఇజెటాప్ సహ వ్యవస్థాపకుడిగా, సీఈఓగా వ్యవహరిస్తున్న బోస్ వచ్చే ఏడాది ప్రారంభంలో వాట్సాప్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు అవసరమైన ఉత్తమ సేవలు అందజేస్తామని వాట్సాప్ సీఈఓ మ్యాట్ ఇడెమా వెల్లడించారు. ఇందులోభాగంగా పెద్ద చిన్న వ్యాపారుతో మమేకమయ్యేందుకు బోస్ బృందం కృషి చేయనుంది.